దారి దోపిడీ : లిఫ్ట్ అడిగి.. కంట్లో కారం చల్లి..ఆర్ఎంపీ వద్ద బంగారు  చైన్, నగదు అపహరణ

దారి దోపిడీ : లిఫ్ట్ అడిగి.. కంట్లో కారం చల్లి..ఆర్ఎంపీ వద్ద బంగారు  చైన్, నగదు అపహరణ

    తిమ్మాపూర్​ మండలంలో ఘటన

తిమ్మాపూర్, వెలుగు: కంట్లో కారం చల్లి తులం బంగారు గొలుసుతో పాటు నగదు అపహరించిన ఘటన కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం నేదునూర్ గ్రామ శివారులో బుధవారం రాత్రి జరిగింది. పోలీసులు తెలిపిన ప్రకారం.. గన్నేరువరం మండలం గుండ్లపల్లె గ్రామానికి చెందిన తమ్మనవేణి కొమురయ్య తిమ్మాపూర్ మండలం నేదునూర్ గ్రామంలో ఆర్‌‌ఎంపీగా పనిచేస్తున్నాడు.

 బుధవారం రాత్రి తన పనులు ముగించుకొని బైక్‌‌పై గుండ్లపల్లె ఎక్స్‌‌ రోడ్ సమీపంలోని ఇంటికి బయలుదేరాడు. మార్గమధ్యలో ఓ వ్యక్తి లిఫ్ట్ కోరడంతో బైక్ ఆపాడు. ఈ సమయంలో అతడు అకస్మాత్తుగా కొమురయ్య కంట్లో కారం చల్లాడు.

వెంటనే మరో వ్యక్తి వెనుక నుంచి వచ్చి అతడిని గట్టిగా పట్టుకున్నాడు. ఇద్దరూ కలిసి మెడలో ఉన్న తులం బంగారు గొలుసు, జేబులో ఉన్న రూ.వెయ్యి లాక్కొని తలపై గట్టిగా కొట్టి అక్కడి నుంచి పరారయ్యారు. బాధితుడు కొమురయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎల్‌‌ఎండీ ఎస్సై అన్వర్ తెలిపారు.